- Home
- Telangana
- Schools Bandh : తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్ ... రేపట్నుంచి వరుసగా నాల్రోజులే..!
Schools Bandh : తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్ ... రేపట్నుంచి వరుసగా నాల్రోజులే..!
తెలంగాణలో జులై 3, 4 తేదీల్లో కాలేజీలు బంద్ కానున్నాయి… మరో తెలుగు రాష్ట్రం ఏపీలో జులై 3న స్కూళ్లు మూతపడనున్నాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్ కు కారణాలేంటో తెలుసా?

తెలంగాణలో కాలేజీలు, ఏపీలో స్కూళ్లు బంద్
Telangana Colleges Bandh : తెలుగు రాష్ట్రాల్లో ఈవారం వరుసగా విద్యాలయాల బంద్ కొనసాగనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో స్కూళ్ళు మూతపడనుండగా తెలంగాణలో కాలేజీలు బంద్ కానున్నాయి. ఇలా జులై 3 అంటే రేపట్నుంచి సెలవులు రానున్నాయి... ఈ బంద్ లు, సెలవులు కలిసి కొన్ని విద్యాసంస్థలకు వరుసగా నాల్రోజుల సెలవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో కాలేజీల బంద్
తెలంగాణలో రెండ్రోజులపాటు కాలేజీలు బంద్ కానున్నాయి. జులై 3,4 అంటే రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ కు PDSU (ప్రోగ్రెసివ్ డొమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్) పిలుపునిచ్చింది. విద్యారంగాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం చేసి స్టూడెంట్స్ జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ ఈ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టూడెంట్స్ బంద్ కు సహకరించాలని పీడీఎస్‌యూ కోరింది.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు డిగ్రీ, పిజి కాలేజీలు ఈ బంద్ పాటించాలని సూచించారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొనాలని పీడీఎస్‌యూ సూచించింది. విద్యార్థులతో పాటు కాలేజీల సమస్యల పరిష్కారం కోసమే తాము ఈ బంద్ చేపట్టినట్లు విద్యార్థి సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు.
రేపు, ఎల్లుండి (గురు, శుక్రవారం) కాలేజీలకు బంద్. జులై 5న శనివారం మొహర్రం సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఉంది. అంటే ఆరోజు కొన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇక జులై 6న ఆదివారం సాధారణ సెలవే. ఇలా కొందరు విద్యార్థులకు రేపట్నుంచి వరుసగా నాల్రోజులు సెలవులు రానున్నాయి.
తెలంగాణ సర్కార్ కు PDSU డిమాండ్లివే
తెలంగాణలో విద్యావ్యవస్థను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం విద్యారంగంలో లోపాలను, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలనే రెండ్రోజుల బంద్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని పీడీఎస్‌యూ కోరుతోంది.
ఈ కాలేజీల బంద్ కు ప్రధాన కారణం పీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలేనని... వెంటనే వాటిని చెల్లించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ గా పీడీఎస్‌యూ పేర్కొంది. ప్రస్తుతం ఈ బకాయిలు రూ.8 వేల కోట్ల వరకు చేరాయని... దీంతో ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజుల పేరిట తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేాశారు.
ఫీజు కట్టే స్తోమతలేని విద్యార్థులు కేవలం ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ లపై ఆదారపడే చదువుకుంటున్నారని.. అలాంటివారి భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం అండగానిలుస్తూ వెంటనే బకాయిలన్ని చెల్లించాలని PDSU కోరింది.
విద్యార్థులకు ఫీజుల పేరుతో వేధించే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా డొనేషన్ల పేరుతో విద్యార్థులకు దోచుకునే ఇంజనీరింగ్ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని పీడీఎస్‌యూ సూచిస్తోంది.
ఇక ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పీడీఎస్‌యూ ఆరోపిస్తోంది. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని... పేద విద్యార్థుల చదువుకు ఉపయోగపడుతున్న ఇలాంటి పథకాలను కొనసాగించాలని సూచిస్తోంది.
తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీడీఎస్‌యూ కోరుతోంది. లేదంటే మిగతా విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తోంది. తెలంగాణ విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తాము ఎంతటి పోరాటికైనా సిద్దమేనని PDSU స్పష్టం చేసింది.
గురువారం ఆంధ్ర ప్రదేశ్ లో స్కూళ్లు బంద్
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రేపు (జులై 3న గురువారం) విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అసోసియేషన్. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రైవేట్ విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని... తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
కొందరు అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థలను రూల్స్ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని... అకారణంగా నోటీసులు జారీ చేస్తున్నారని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. తనిఖీల పేరిట కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడమే కాదు గుర్తింపు రద్దు చేస్తామని కూడా కొందరు అధికారులు బెదిరిస్తున్నారని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలన్ని జులై 3న బంద్ పాటించనున్నాయి. అయితే ప్రభుత్వ విద్యాసంస్థలు మాత్రం యధావిధిగా నడవనున్నాయి. ఇలా తెలంగాణలో కాలేజీలు, ఏపీలో స్కూళ్లు గురువారం బంద్ కానున్నాయి.