KCR: ఉట్టి తెగదు పిల్లి కోరిక తీరదు.. కేసీఆర్ చెప్పిన ఈ సామెత అర్థం ఏంటో తెలుసా.?
KCR: సీరియస్‌గా సాగే పొలిటికల్ మీటింగ్‌ను కూడా ఎంటర్టైనర్గా మార్చే సత్తా కేసీఆర్ సొంతం. పత్యర్థులను తిడుతూనే ఆయన చెప్పే కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా చేసిన అలాంటి వ్యాఖ్యలే చర్చకు తెర తీశాయి.

ఉట్టి ఎక్కలేని పిల్లి… తెగాలని కోరుకునే కోరిక
జగిత్యాలలో జరిగిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన ఒక సామెత ఒక్కసారిగా చర్చకు వచ్చింది. “ఉట్టి ఎక్కలేని పిల్లి ఉట్టి తెగాలని కోరుకుంటుంది” అన్న ఆయన వ్యాఖ్య కేవలం చమత్కారం మాత్రమే కాదు… రాజకీయంగా ఒక గాఢమైన సందేశం కూడా. ఈ మాట వెనక ఉన్న గ్రామీణ జీవితం, సంస్కృతి, భావం ఏంటో తెలుసుకుంటే ఈ సామెత అసలు అర్థం తెలుస్తుంది.
అసలు ఉట్టిలు అంటే ఏంటి.?
ఈరోజుల్లో ఫ్రిజ్, కబోర్డులు సాధారణమయ్యాయి. కానీ పూర్వం పెంకుటిళ్లలో ఆహారం భద్రపరచడం ఒక సవాల్. ప్రత్యేకంగా చేపల కూర, చికెన్ వంటి వంటకాలు పిల్లులు తినకుండా కాపాడుకోవడం అవసరం. అందుకే ఇంట్లో ఉండే దూలాలకు తాడుతో పాత్రను కట్టి పైకి వేలాడదీసేవారు. దీనినే “ఉట్టి” అని పిలిచేవారు. ఇది ఒక సాదా పద్ధతి అయినా చాలా ప్రభావవంతమైనది.
పిల్లి-ఉట్టి కథ: సామెత ఎలా పుట్టిందంటే.?
పిల్లికి ఆహారం వాసన వస్తుంది. కానీ ఉట్టి ఎత్తులో ఉండటంతో అది చేరుకోలేను. అప్పుడు అది ఉట్టి కింద కూర్చొని పైకి చూస్తూ… “ఈ తాడు తెగిపోవాలి” అని మనసులో కోరుకుంటుందట. ఇక్కడే సామెత పుట్టింది. సాధ్యం కాని విషయం కోసం కోరిక పెట్టుకోవడం… అది ఎప్పటికీ నెరవేరదనే భావన ఈ కథలో దాగి ఉంది.
పిల్లికి తాడు తెగడం అసాధ్యం అని తెలియదు. అందుకే అది ఆ ఆశతోనే ఉంటుంది. కానీ వాస్తవం ఏమిటంటే… ఉట్టి ఎప్పటికీ అలాగే ఉంటుంది. పిల్లి కోరిక మాత్రం తీరదు. ఇదే జీవితానికి అన్వయిస్తే… మనం సాధ్యం కాని విషయాల కోసం ఆశపడితే ఫలితం ఉండదనే సందేశం ఈ సామెత ఇస్తుంది.
కేసీఆర్ మాటల్లో రాజకీయ సందేశం
ఈ సామెతను కేసీఆర్ తన శైలిలో ఉపయోగించడం ప్రత్యేకం. తన చావు కోరుకుంటున్న వారిని పిల్లితో పోల్చుతూ… “పిల్లి కోరికలాగే అది అసాధ్యం” అని చమత్కరించారు. ఇక్కడ ఆయన ఒకేసారి రెండు విషయాలు చెప్పారు. ప్రత్యర్థుల ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, తన రాజకీయ స్థిరత్వంపై ధీమాను వ్యక్తం చేశారు. ఇది ఆయన భాషా పట్టు, రాజకీయ వ్యూహం రెండింటినీ చూపిస్తుంది.
సామెతలు, చమత్కారం: కేసీఆర్ ప్రత్యేకత
కేసీఆర్ మాట్లాడితే సామెతలు, స్థానిక ఉదాహరణలు తప్పనిసరిగా ఉంటాయి. అవి వినేవారికి సులభంగా అర్థమవుతాయి. గ్రామీణ జీవితం నుంచి తీసుకున్న ఉదాహరణలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన మాటలు కేవలం రాజకీయ ప్రసంగం కాదు… ఒక కథలా, ఒక అనుభవంలా అనిపిస్తాయి. ఈసారి కూడా “ఉట్టి ఎక్కలేని పిల్లి” అన్న ఒక్క మాటతోనే ఆయన తన సందేశాన్ని స్పష్టంగా చెప్పలినట్లైంది.

