- Home
- Telangana
- Hyderabad: ఊపిరి పీల్చుకోండి.. తీరనున్న ఏళ్లనాటి ట్రాఫిక్ కష్టాలు. ఆ ప్రాంతాల్లో రియల్ బూమ్ ఖాయం
Hyderabad: ఊపిరి పీల్చుకోండి.. తీరనున్న ఏళ్లనాటి ట్రాఫిక్ కష్టాలు. ఆ ప్రాంతాల్లో రియల్ బూమ్ ఖాయం
హైదరాబాద్‌లో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ఫ్లై ఓవర్స్‌కి మార్గం సుగుమమైంది.

హైదరాబాద్ కోర్ సిటీలో సమగ్ర అభివృద్ధే లక్ష్యం
హైదరాబాద్ కోర్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలు, అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. రాబోయే 25 సంవత్సరాల్లో నగర జనాభా పెరుగుదల, ట్రాఫిక్ ఒత్తిడి, కనెక్టివిటీ వంటి అంశాల దృష్ట్యా దీర్ఘకాలిక వ్యూహం సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
హెచ్ఎండీఏ - రక్షణ శాఖ మధ్య అవగాహన ఒప్పందం
హైదరాబాద్ మున్సిపల్ అభివృద్ధి సంస్థ (HMDA), రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, నగర ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీని కోసం రక్షణ శాఖ రాష్ట్రానికి 65.038 ఎకరాల భూమిని అప్పగించగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగా 435 ఎకరాలను అందించనుంది.
రెండు ప్రధాన ఎలివేటెడ్ కారిడార్లు
ఈ ప్రాజెక్టులో భాగంగా, ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు 18.14 కిలోమీటర్లు పొడవున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇది వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, ఆల్వాల్, హకీంపేట్, తుంకూరు ప్రాంతాల మీదుగా వెళ్లనుంది. నగరంలో అత్యంత ట్రాఫిక్ ఉండే మార్గాల్లో ఇది ఒకటి.
మరో కారిడార్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు 5.32 కిలోమీటర్లు ఉండబోతోంది. ఇది సికింద్రాబాద్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి జంక్షన్‌ల మీదుగా సాగి, డైరీ ఫామ్ రోడ్ వద్ద ముగుస్తుంది. పీక్ అవర్స్‌లో ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్‌కు చేరుకోవడానికి 40 నిమిషాల వరకు పడుతుంది.
ట్రాఫిక్ తగ్గింపు, కనెక్టివిటీ మెరుగుదల
ఈ కారిడార్ల నిర్మాణం పూర్తయితే, సికింద్రాబాద్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గనుంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ప్రయాణ సమయం తగ్గిపోవడంతో పాటు, స్మార్ట్ కనెక్టివిటీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇది నగర పౌరులకు మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకూ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
పీపీపీ విధానంలో నిర్మాణం
ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లను హెచ్ఎండీఏ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో నిర్మించనుంది. రక్షణ శాఖ నుండి భూముల బదిలీకి గతేడాది మిగిలిన అనుమతుల ప్రకారం పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముంది. నిర్మాణం పూర్తయిన తర్వాత నగర మౌలిక వసతుల్లో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
ఆ ప్రాంతాల్లో పెరగనున్న రియల్ బూమ్
శామీర్‌పేట, మేడ్చల్ వంటి నగర శివారుల నుంచి సిటీలోకి రావాలంటే ప్రస్తుతం కనీసం 1.30 నిమిషాలు పడుతోంది. అయితే ఈ రెండు కారిడార్‌లు అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాల నుంచి సికంద్రాబాద్‌కు దాదాపు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. దీంతో ఈ శివారు ప్రాంతాల్లో ఉన్న భూములకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ కారిడార్లలో రోడ్డుకు సమాంతరంగా మెట్రో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై తాజాగా కేంద్ర ప్రభుత్వానికి అనుమతులు కోరగా అనుమతులు లభించలేవు. ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో స్పష్టత లేదని కేంద్రం తెలిపింది. అయితే భవిష్యత్తులో ఈ మార్గాల్లో మెట్రో పరుగులు పెట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.