Weather Report: వచ్చే నాలుగు రోజులు అలర్ట్‌గా ఉండాల్సిందే.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కొనసాగుతున్నాయి. ఒక్క వైపు ఎండలు దంచికొడుతున్నాయి. అలాగే మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇలా భిన్నమైన వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం వచ్చే నాలుగు రోజులు కూడా ఈ అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తు్నాడు. అదే సమయంలో సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఈదురు గాలులతో వెదర్ కూల్‌గా మారుతుంది. అదే సమయంలో వర్షం కూడా కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే రానున్న 4 రోజులు ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో పొడి వాతావరణం.
తెలంగాణలో ఈ వారంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం, బుధవారం నాటి గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌లో 42.3°C, హైదరాబాద్‌లో 37.1°C వరకు పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం.
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం:
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓవైపు ఎండలు మరో వైపు పిడుగులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం, బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడవచ్చు.