PM Modi: ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం
PM Modi: బ్రెజిల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి 114 గుర్రాల సైనిక గౌరవంతో ఘనస్వాగతం లభించింది. అలాగే, బ్రెజిల్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్' తో సత్కరించింది.

బ్రసీలియాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఐదు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా బ్రెజిల్ చేరుకున్నారు. రాజధాని బ్రసీలియాలో ఆయనకు 114 గుర్రాల సైనిక గౌరవంతో ఘన స్వాగతం లభించింది. ఈ అత్యంత అరుదైన గౌరవం ద్వైపాక్షిక సంబంధాల్లో బ్రెజిల్ తో ఉన్న ప్రాధాన్యతను చాటుతుంది.
Vislumbres da cerimônia de boas-vindas em Brasília. Esta visita de Estado ao Brasil dará um novo impulso às nossas relações bilaterais.@LulaOficialpic.twitter.com/KcErMeHonx
— Narendra Modi (@narendramodi) July 8, 2025
అల్వొరాదా ప్యాలెస్ లో పీఎం మోడీకి అధికారిక ఆతిథ్యం
బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ప్రధాని మోడీకి బ్రసీలియాలోని అల్వొరాదా ప్యాలెస్ వద్ద సాదర ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెండు దేశాల జెండాలు, సైనిక గౌరవ వందనాలతో పాటు అధికార ప్రతినిధుల పరిచయం వంటి ప్రధాన కార్యక్రమాలు జరిగాయి.
బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మోడీ
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘Grand Collar of the National Order of the Southern Cross’ ను అధ్యక్షుడు లులా డా సిల్వా స్వయంగా అందజేశారు. ఈ అవార్డు విదేశీ నేతలకు మాత్రమే ఇస్తారు. అది కూడా బ్రెజిల్‌తో తమ దేశ సంబంధాలను శక్తివంతంగా అభివృద్ధి చేసిన వారికి మాత్రమే. దీనిని భారత ప్రధాని అందుకోవడం చారిత్రాత్మక క్షణంగా నిలిచింది.
ఈ పురస్కారంతో ప్రధాన మోడీకి లభించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 26కు చేరింది. మోడీ 2014 మేలో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి 26వ సారిగా ఓ విదేశీ ప్రభుత్వం ఆయనకు గౌరవంగా అత్యున్నత పురస్కారం అందించింది.
బ్రిక్స్ (BRICS) 2025 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ
ఈ పర్యటనలో భాగంగా రియో డి జెనీరోలో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit 2025) లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న అనంతరం మోడీ బ్రసీలియాకు చేరుకొని అక్కడ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫోంట్‌తో సమావేశమైన అనంతరం మోడీ ట్విట్టర్ ద్వారా "భారత్-చిలీ స్నేహం మరింత బలపడుతోంది" అంటూ ట్వీట్ చేశారు.
Delighted to have met President Gabriel Boric Font of Chile during the Rio BRICS Summit. India-Chile friendship is getting stronger and stronger! @GabrielBoricpic.twitter.com/0OJn0P9HUK
— Narendra Modi (@narendramodi) July 8, 2025
పీఎం మోడీ ఐదు దేశాల పర్యటన
ఈ బ్రెజిల్ పర్యటన ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో మూడో పర్యటన ఇది. ఆయన ఇప్పటికే ఘానా, ట్రినిడాడ్ & టొబాగో పర్యటనలు పూర్తి చేశారు.
ఇది ప్రధానిగా నరేంద్ర మోడీకి నాలుగోసారి బ్రెజిల్ పర్యటన కావడం గమనార్హం. 2014లో తొలి పర్యటన అనంతరం, 2019 BRICS సదస్సు, 2024లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఆయన బ్రెజిల్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈసారి పర్యటన ప్రత్యేకతలు గమనిస్తే.. ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయడం. వాణిజ్యం, ఇంధన రంగం, వాతావరణ మార్పు, రక్షణ వంటి కీలక రంగాల్లో సహకారం పైన దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.