Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి? దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు!
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాదులను అధిక సంఖ్యలో మట్టుబెట్టింది.

ఆపరేషన్ సింధూర్
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ కలిసి చేసిన తాజా దాడులు తీవ్ర కలకలం రేపాయి. 'ఆపరేషన్ సింధూర్' అనే పేరుతో సాగిన ఈ దాడుల్లో భారీ స్థాయిలో ఉగ్రవాదులు హతమయ్యారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇది కేవలం భద్రతా చర్య మాత్రమే కాదు, దేశం తీసుకున్న ఓ బలమైన ప్రతీకార చర్యగా నిలిచింది.
తగ్గేదేలే
ఈ దాడితో భారత్ ఒకటి స్పష్టంగా తెలిపింది. భద్రత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే మరోసారి తగిన జవాబు ఇస్తామని సంకేతం ఇచ్చింది. సరిహద్దుల్లో భద్రతా దళాలు పూర్తిగా రెడీగా ఉన్నాయి. పాకిస్థాన్ వైపు నుంచి ఏదైనా కదలిక కనిపించినా, ఈసారి స్పందన మామూలుగా ఉండబోదని స్పష్టంగా చెప్పినట్లైంది.
పహల్గామ్ ఉగ్రదాడి
ఇంతకీ, ఈ ఆపరేషన్‌కు 'సింధూర్' అనే పేరు ఎందుకు పెట్టారు అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. దీని వెనక ఉన్న భావోద్వేగాలే దీనికి అసలు అర్ధాన్ని ఇచ్చాయి. కాశ్మీర్‌ను మనం దేశ తలమై భావిస్తాం. అక్కడ పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమాయకుల రక్తం రాలింది. ప్రభుత్వం ఈ దాడిని భరతమాత నుదుటిపై జరిగిన దాడిగా భావించింది. అందుకే ఆ రక్తాన్ని సింధూరంతో పోల్చుతూ, ఆపరేషన్‌కి ఈ పేరు పెట్టారు.
14 రోజుల తర్వాతే
ఇంకో విషయం ఏమిటంటే, హిందూ సంప్రదాయాల ప్రకారం ఎవరు చనిపోతే, వారి ఆత్మకు శాంతి కలిగించేందుకు 14 రోజులపాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. కేంద్రం కూడా 14 రోజుల తర్వాతే ఈ దాడికి పూనుకోవడం గమనార్హం. ఇదీ ఆపరేషన్ వెనక మరో భావన.
భావోద్వేగాలకు చెందిన కోణం
ఈ దాడిలో ఉగ్రవాదులు మతాన్ని ఆధారంగా చేసుకుని ప్రజలను లక్ష్యంగా చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందువులపై దాడి జరిగినందున, సింధూరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సింధూరం హిందూ మహిళలకు ఎంతో పవిత్రమైనది. హిందూ మహిళలు నిత్యం తమ నుదుటన సింధూరాన్ని ధరిస్తారు. ఆ దాడిలో భర్తలను కోల్పోయిన ఎంతో మంది మహిళలు ఉన్నారు. ఇది సంఘటనకు ఒక భావోద్వేగ కోణాన్ని ఇస్తోంది.దీనిని ప్రధానంగా తీసుకునే ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తుంది