- Home
- Entertainment
- Movie Reviews
- 8 Vasantalu Review: `8 వసంతాలు` మూవీ రివ్యూ, రేటింగ్.. పొయెటిక్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
8 Vasantalu Review: `8 వసంతాలు` మూవీ రివ్యూ, రేటింగ్.. పొయెటిక్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
`మను` ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `8 వసంతాలు`. అనంతిక సనిల్ కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

`8 సవంతాలు` మూవీ రివ్యూ
ఇటీవల టీజర్, ట్రైలర్‌తో అందరిని దృష్టిని ఆకర్షించింది `8 వసంతాలు` మూవీ. ఈ చిత్రానికి `మను` చిత్రంతో ఆకట్టుకున్న ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో అనంతిక సనిల్‌కుమార్, హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ ముఖ్య పాత్రలు పోషించారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(జూన్ 20)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`8 వసంతాలు` మూవీ కథ ఏంటంటే?
శుద్ధి(అనంతిక సనిల్ కుమార్) ఒక రైటర్, ఆమె రాసిన పుస్తకం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే సమయంలో ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా, మరోవైపు కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందుతుంది. ఇలా మల్టీటాలెంటెడ్‌గా ఉన్న శుద్ధి రైటర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
అయితే రీసెంట్‌గానే ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో మానసికంగా చాలా కుంగిపోతుంది. ఆ అనుభవాలతోనే బుక్ రాయగా అది ఎందరినో కదిలిస్తుంది. చిన్నప్పట్నుంచి కార్తీక్(కన్నా)తో కలిసి పెరుగుతుంది. అతను బెస్ట్ ఫ్రెండ్. అయితే అప్పుడే ఊటికి వరుణ్(హనురెడ్డి) వస్తాడు.
తనొక మ్యూజీషియన్. శుద్ధి గురించి తెలిసి ఫిదా అవుతాడు. ఆమె రాసిన పుస్తకం చదివి ఆమె వెంటపడతాడు. తన మాటలతో ఆమెని ఇంప్రెస్ చేస్తాడు. కాశ్మీర్‌లో ఉన్న ఆమె కోసం ప్రతి ఆదివారం ఊటీ నుంచి వెళ్తాడు. దీంతో వరుణ్ ప్రేమలో పడిపోతుంది శుద్ధి. వరుణ్ కూడా ప్రపోజ్ చేస్తాడు. కానీ దానికి సమాధానం చెప్పదు, టైమ్ తీసుకుని చెప్పాలనుకుంటుంది.
వరుణ్ అడిగాడని మక్కుపుడక కూడా కుట్టించుకుంటుంది. కానీ నాన్న డ్రీమ్ అయిన స్టడీస్‌లో వరుణ్ తప్పుతాడు. దీంతో చాలా కుంగిపోతాడు. శుద్ధితో తిరగడం వల్లే ఇదంతా అని చెప్పి ఆమెని దూరం పెడతారు. చివరికి యూఎస్‌కి వెళ్లిపోతుంటారు.
ఈ విషయం తెలిసి వరుణ్‌ని కలవడానికి వెళ్తుంది. కానీ అతను శుద్ధిని పట్టించుకోడు, తమ మధ్య ఉన్నది ప్రేమ కాదు, ఎట్రాక్షన్ మాత్రమే అని చెబుతాడు. దీనికి హార్ట్ అయిన శుద్ధి తనదైన స్టయిల్‌లో రాణిలా క్లాస్ పీకి వెళ్లిపోతుంది. అలా తన లవ్ బ్రేకప్ అవుతుంది.
దాన్నుంచి శుద్ధి ఎలా బయటపడింది? తాను కోరుకున్న కరాటే బ్లాక్ బెల్ట్ సాధించిందా? తన జీవితంలో గురువు పాత్ర ఏంటి? కరాటే మాస్టర్‌తో తనకున్న అనుబంధం ఏంటి? ఈ జర్నీలో పరిచయం అయిన సంజయ్(రవితేజ దుగ్గిరాల) పాత్ర ఏంటి?
ఆయనకు శుద్ధి ఎందుకు పడిపోయింది? ఇంతలో తన జీవితంలో చోటు చేసుకున్న మరో సంఘటన ఏంటి? చివరికి శుద్ధి జర్నీ ఎలా సాగింది? తన ప్రేమకు ముగింపు ఎక్కడ పడింది? అనేది మిగిలిన కథ.
`8 వసంతాలు` మూవీ విశ్లేషణ
`8 వసంతాలు` మూవీ ప్రేమ కథల్లో ఒక విభిన్నమైన చిత్రం. పొయెట్రీని, స్వచ్ఛమైన ప్రేమని మేళవిస్తూ ఒక ఫ్రెష్ పొయెటిక్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇటీవల కాలంలో ఇలాంటి కవితాత్మకమైన ప్రేమ కథ రాలేదనే చెప్పాలి.
బలమైన డైలాగ్‌లతో, సంఘర్షణతో కూడిన పాత్రలతో, బరువైన సన్నివేశాలతో, గుండెని బరువెక్కించే ఎమోషన్స్ తో, హృదయాన్ని పిండేసే ప్రేమతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన తీరు బాగుంది. సినిమాలో డైలాగ్‌లే హైలైట్‌గా నిలుస్తాయి.
ప్రతి ఐదు నిమిషాలకు ఒక డైలాగ్ గుండెని గుచ్చేస్తుంది. మనసుని కదిలిస్తుంది. ఆలోచింప చేస్తుంది. వాస్తవ ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. సినిమా మెయిన్ గా శుద్ధి పాత్ర ప్రధానంగా సాగుతుంది. వివిధ స్టేజ్‌లోని ఆమె లైఫ్‌ని చూపించడం విశేషం.
శుద్ధి, వరుణ్, సంజయ్ ల మధ్య ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. నిజానికి మనకు తెలియకుండానే మనం ఆ ప్రేమలో పడి కొట్టుకుపోతుంటాం. అంత బాగా ఆ ప్రేమని వ్యక్తీకరించాడు, తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. పొయెటిక్‌గా ఉన్నా, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగానే ఉంది.
యూత్‌కి ఆకట్టుకునేలా ఉంది. క్రేజీ డైలాగ్‌లతో మతిపోయేలా చేశాడు దర్శకుడు. గురువు చితికి నిప్పంటించే సమయంలో `బిడ్డకి జన్మనిచ్చి ప్రాణం పోయగా లేనిది, కర్మఖండాలు చేసిన మోక్షం ఇవ్వలేమా`, వేశ్య ప్రేమించిన వ్యక్తి తనని అవమానించినప్పుడు `నా శరీరం బురదగుంట కావచ్చు, కానీ నా మనసు తులసి కోట` మరోవైపు ప్రియుడు మోసం చేసి వెళ్లిపోతున్నప్పుడు మహిళ వ్యక్తిత్వాన్ని, రాణిలా తాను మాట్లాడిన తీరు, డిగ్నీటీ గురించి చెప్పిన డైలాగ్‌లు వాహ్ అనిపిస్తాయి.
`8 వసంతాలు` లో మైనస్‌లు
ఇక సినిమాగా చూసినప్పుడు కరాటే ఇనిస్టిట్యూట్‌లో ప్రారంభమవుతుంది. ఒక అబ్బాయిని వరుణ్ కొడుతునప్పుడు అతన్ని కాపాడటం కోసం శుద్ధి కరాటే చేసి అతన్ని ఓడించడంతో ఆమె ప్రేమలో పడతాడు వరుణ్.
ఆ తర్వాత నుంచి ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు తానుచేసే ప్రయత్నాలు బాగుంటాయి. అయితే సడెన్‌గా శుద్ధి ప్రేమకి యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా రియాక్ట్ అవడం, ఆయనతో తిరగడంలో కొంత అసహజంగా అనిపిస్తుంది.
ఆ తర్వాత వరుసగా సీన్లు రిపీట్ అవుతుంటాయి. కథ ముందుకు సాగదు, దీంతో కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయింది. లవ్ బ్రేకప్ సమయంలో వరుణ్, శుద్ధిల మధ్య కన్వర్జేషన్ విజిల్స్ వేసేలా ఉంటుంది.
సన్నివేశాల గాఢత కంటే డైలాగ్‌లో ఇంటెన్సిటీ ఎక్కువైందన్న ఫీలింగ్ కలిగింది. ఫస్టాఫ్ లో వాహ్ ఫ్యాక్టర్ ఉన్నా, సెకండాఫ్ మాత్రం డల్‌గా సాగుతుంది. కథ అనేక మలుపులు తిరుగుతుంది. శుద్ధి మళ్లీ ప్రేమలో పడటం, ఈ క్రమంలో సాగే సన్నివేశాలు కొంత రొటీన్ అనిపిస్తాయి.
అంతగా ఆకట్టుకునేలా లేవు, సహజంగానూ లేవు. కానీ క్లైమాక్స్ ని మాత్రం చాలా ఎమోషనల్ గా డిజైన్ చేశారు. ప్రేమలోని పీక్‌ని చూపించారు. హృదయాన్ని కదిలించేలా ఆయా సన్నివేశాలుంటాయి. ఎమోషనల్ రైడ్‌లా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ ముందు సన్నివేశాలు కూడా బాగా డిజైన్ చేసుకోవాల్సింది.
ఇంకోవైపు సినిమాలో డైలాగ్‌లకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఆ డైలాగ్‌ల్లో ఉన్న బలం సన్నివేశాల్లో లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. అదే సమయంలో డైలాగ్‌ల కోసమే సినిమా తీసినట్టుగా ఉంటుంది. శుద్ధి తన 19 ఏళ్లలోని ప్రేమకి, 27ఏళ్లలోని ప్రేమకి ఏమాత్రం డిఫరెంట్స్ లేదు.
కానీ విజువల్స్, మ్యూజిక్, డైలాగ్‌లు ఈ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. కొన్ని మైనస్‌లను బాగా డీల్ చేసి ఉంటే సినిమా బాగుండేది. అయితే ఇలాంటి సినిమాలు చూడ్డానికి, క్రిటికల్‌గా బాగా అనిపించినా, బీ, సీ ఆడియెన్స్ లోకి వెళ్లడం కాస్త కష్టమనే చెప్పాలి.
`8 వసంతాలు`లో ఆర్టిస్ట్ ల నటన ఎలా ఉందంటే?
శుద్ధి పాత్రలో అనంతిక సనిల్ కుమార్ నటన ఈ మూవీకి హైలైట్‌గా చెప్పొచ్చు. ఆమెనే సినిమాకి హీరో. ఆ పాత్రలో అనంతిక అద్భుతంగా చేసింది. కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి బలమైన, ఎమోషనల్ రోల్ చేయడం మామూలు విషయం కాదు, ఈ పాత్రకి ప్రాణం పోసింది.
అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. కళ్లతోనే మాయ చేసేసింది. నవ్వుతో మతిపోగొట్టింది. ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టింది. సినిమాకే ఆమెనే ప్రధాన బలం.
ఇక వరుణ్ పాత్రలో హను రెడ్డి సైతం బాగా చేశాడు. ప్రేమికుడిగా, తనలోని డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. స్వార్థమైన లవర్‌గా కనిపించాడు. ఇక సంజయ్ పాత్రలో రవితేజ దుగ్గిరాల సైతం సెటిల్డ్ గా బాగా చేశాడు. సిన్సియర్ లవర్‌గా అతని నటన ఆకట్టుకుంటుంది.
సెకండాఫ్ లో వచ్చి క్లైమాక్స్ లో సినిమా మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. ఆ పాత్రలోనూ అంతే హుందాగా నటించి మెప్పించాడు. `8 వసంతాలు` టైటిల్‌కి తన పాత్ర ఇచ్చిన జస్టిఫికేషన్ వాహ్ అనేలా ఉంది.
శుద్ధి ఫ్రెండ్ కార్తీక్ పాత్రలో కన్నా కూడా అదరగొట్టాడు. అతని పాత్రకి కూడా మంచి ప్రయారిటీ దక్కింది. తను కూడా ఎమోషనల్ రోల్‌లో అలరించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు అలరించారు.
`8 వసంతాలు` మూవీ టెక్నీషియన్ల పనితీరు
సినిమాకి టెక్నీషియన్లే ప్రధాన బలం. మ్యూజిక్ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది. సాంగ్స్ అన్నీ అలరించేలా ఉన్నాయి. లవ్ స్టోరీలకు హేషమ్ అబ్దుల్ వహాబ్ బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నారు. తన పాటలతో సినిమా లెవల్‌ని పెంచారు.
అదే సమయంలో బిజీఎంతో కూడా సన్నివేశాలకు ప్రాణం పోశారు. లవ్ లోని ఎమోషన్‌ని ప్రతిబింబించే సీన్లలో ఆర్‌ఆర్ అదిరిపోయింది. ఆ మ్యూజిక్ ఆడియెన్స్ ని వెంటాడుతుంటుంది. ఇక డీఓపీ విశ్వనాథ్ రెడ్డి సినిమాని ఒక విజువల్ ఫీస్ట్ లా తయారు చేశారు. ఆయన ప్రతి ఫ్రేమ్ వండర్‌గా అనిపిస్తుంది.
లాంగ్ షాట్‌లు చూపించిన తీరు, గ్రీనరీని ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇంకా చెప్పాలంటే కెమెరాతోనే తన కథని చెప్పాడు. ఆడియెన్స్ ని కనువిందు చేశాడు. ఎడిటర్ శశాంక్ మాలి కొంత ఎడిటింగ్ చేయాల్సింది. బట్ ఉన్నంత వరకు నీట్‌గా ఉంది.
నిర్మాణ విలువలకు కొదవ లేదు. చాలా రిచ్‌గా, రాజీపడకుండా నిర్మించారు. ఇక దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమాని తీసిన తీరు బాగుంది. డైలాగ్‌లను చాలా బాగా రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు పెట్టారు. కానీ అవి కాస్త ఓవర్‌గా అనిపించాయి. అతిగా తనలోని ప్రతిభని చూపించిన ఫీలింగ్ కలుగుతుంది.
సన్నివేశాలు, పాత్రలు తక్కువైపోయాయి, కానీ చెప్పాలనుకున్న విషయాలు ఎక్కువైపోయాయి, సమాజానికి ఒక క్లాస్ పీకేలా ఉన్నాయి. డైలాగ్‌లు ఓవర్ బోర్డ్ అయిపోయాయి. దీంతో చాలా డైలాగ్‌లు బాగా ఉన్నా, వృధా ప్రయాసలాగా మారిపోయాయి.
సినిమాకి, సన్నివేశాలకు ఎంత డోస్‌లో ఉండాలో అంతే ఉండాలి, కానీ ఇందులో డోస్ పెరిగడంతో ఓవర్‌గా అనిపిస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ప్రేమ కథలను చూపించిన తీరు, ఎమోషన్స్ ని ఆవిష్కరించిన తీరు మాత్రం అదిరిపోయింది.
ఫైనల్‌గాః విజువల్‌గా కనువిందు చేసే పొయెటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ `8 వసంతాలు`.
రేటింగ్‌ః 2.75