Walking Benefits: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పనిచేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వాకింగ్ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. మరీ ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు ఓ అరగంట వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

సులభమైన వ్యాయామాల్లో వాకింగ్ ఒకటి. చాలామంది ఉదయం వాకింగ్ చేస్తుంటారు. మార్నింగ్ కుదరని వాళ్లు సాయంత్రం నడుస్తుంటారు. అయితే ప్రతిరోజూ సాయంత్రం అరగంట నడవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
మంచి నిద్ర
రాత్రిపూట నడక వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యమైంది నిద్ర. వాకింగ్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, సాయంత్రం నడక రాత్రి నిద్రను మెరుగుపరుస్తుందని తేలింది. ప్రతిరోజూ పడుకునే ముందు నడవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, ఆందోళన తగ్గుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి, రాత్రిపూట మంచి నిద్రను పొందడానికి రాత్రి నడక సహాయపడుతుంది.
జీవక్రియ:
రాత్రి పడుకునే సమయంలో జీవక్రియ పెరుగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 30 నిమిషాలు నడిస్తే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 2022లో న్యూట్రియెంట్స్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. ఇంటెన్సివ్ వ్యాయామాలు ఎక్కువ కేలరీలను బర్న్ చేసినట్లే.. సాయంత్రం నడక రాత్రిపూట ఆకలిని అదుపులో ఉంచుతుంది.
మానసిక ఆరోగ్యం:
సాయంత్రం నడవడం వల్ల శరీరం మాత్రమే కాకుండా మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి నడక సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి రాత్రి నడక సహాయపడుతుంది. పడుకునే ముందు నడవడం వల్ల ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి.. సానుకూల ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది.
జీర్ణక్రియ:
కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కడుపు ఉబ్బరం లేదా అజీర్తి ఉంటుంది. వారు రాత్రి కొంతసేపు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తర్వాత నడవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా అజీర్తి తగ్గుతుందని అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం చెబుతోంది.