Mutton: వంకాయ మటన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ మామూలుగా ఉండదు!
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ మటన్. చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మంచిది కాబట్టి రెగ్యులర్ గా మటన్ తింటుంటారు. కానీ మటన్, వంకాయ కలిపి చేసిన కర్రీ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ మామూలుగా ఉండదు. ఎలా చేయాలో ఇక్కడ చూసి.. ఓసారి ట్రై చేయండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది!

మటన్, వంకాయ కలిపి కర్రీ చేసుకోవచ్చని చాలామందికి తెలిసి ఉండదు. కానీ వీటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఇంట్లో కూర చేస్తే వీధంతా వాసన రావాల్సిందే. మరి ఈ కర్రీని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మటన్ - 1/2 కిలో
చిన్న వంకాయలు - 200 గ్రా.
టమాటా - 2 (ముక్కలు)
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కారం పొడి - 1 1/2 టేబుల్ స్పూన్లు
పసుపు - 1/2 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ విధానం:
ఒక పాత్రలో నూనె వేసి వేడెక్కాక.. కరివేపాకు, చిన్న వంకాయలు వేసి బాగా వేయించాలి. వంకాయలు బాగా వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వాసన పోయాక టమాటా కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అన్ని మసాలా దినుసులు వేసి బాగా కలపాలి. మటన్ ముక్కలు వేసి.. ఆ మసాలాతో బాగా కలిపి.. 5 నిమిషాలు వేయించాలి. తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరిగించాలి. కుక్కర్ లో అయితే 4 విజిల్స్ వరకు ఉడికించవచ్చు. కూర చిక్కగా అయ్యే వరకు పెద్ద మంట మీద ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి వడ్డించాలి.
ఈ కర్రీని వేటితో తింటే బాగుంటుంది?
ఈ కర్రీలో చిన్న వంకాయలే హీరో. అవి వేస్తేనే కూరకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. వంకాయ మటన్ కర్రీని అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. చపాతీ, పరోటాతో తిన్నా సూపర్ గా ఉంటుంది.
ఇది గుర్తుంచుకోండి!
కర్రీ తయారు చేసిన వెంటనే తినకండి. ఒక గంట సేపు కూరను స్టవ్ మీదే అలా పక్కన పెట్టండి. వంకాయలు, మసాలాలు, మటన్ అన్నీ బాగా కలిసి టేస్ట్ సూపర్ గా ఉంటుంది.