- Home
- Fact Check
- Viral Video: ఏపీలో ఆకాశం నుంచి కింద పడుతోన్న మేఘాలు.. వైరల్ అవుతోన్న వీడియోలు. ఇంతకీ ఏం జరుగుతోంది.?
Viral Video: ఏపీలో ఆకాశం నుంచి కింద పడుతోన్న మేఘాలు.. వైరల్ అవుతోన్న వీడియోలు. ఇంతకీ ఏం జరుగుతోంది.?
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎక్కడ, ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. రొటీన్‌కు కాస్త భిన్నంగా ఉన్న ఏ సంఘటన అయినా సరే వైరల్ అవుతోంది. అయితే వైరల్ అయ్యేదంతా నిజమా.? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం.

కింద పడుతోన్న మేఘాలు.!
ఆకాశం నుంచి తోక చుక్కలు, ఉల్కలు కింద పడడం చాలా మంది చూసే ఉంటాం. ఇది చూడ్డానికి ఎంతో అద్భుతం ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఖగోళ వింతలు ఎక్కడో ఒక చోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే ఆకాశం నుంచి మేఘాలు కింద పడడం ఎప్పుడైనా చూశారా.?
మేఘాలు ఏంటి.? భూమ్మీద పడడం ఏంటని ఆలోచిస్తున్నారా.? ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మేఘాలు కింద పడుతున్నాయంటూ చాలా మంది వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనే
మేఘాలు పడుతున్నాయని ప్రచారం జరుగుతోంది మరెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోనే. ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున ఇలాంటి వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. ఆకాశం నుంచి మేఘం రూపాన్ని పోలినవి భూమ్మీద పడడం ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రజలు వీటిని ఆశ్చర్యంగా చూస్తూ తమ స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నారు.
ఇవి నిజంగానే మేఘాలా.?
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇవి మేఘాలు కావు. నిజానికి మేఘం కింద పడడం అనేది అసాధ్యం. అయినా మేఘాలు అంత తక్కువ పరిమాణంలో ఉండవు, చాలా పెద్దగా ఉంటాయి. ఈ వీడియోల్లో కనిపిస్తోంది కేవలం ఒక నురుగు మాత్రమే.
అసలు విషయం ఏంటంటే.?
సహజంగా ఇలాంటి నురుగు ఫ్యాక్టరీల నుంచి వస్తుంది. ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చే కెమికల్స్ నీటితో కలవడం వల్ల ఇలాంటి నురుగు ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడం, గాలులు వీస్తుండడంతో ఈ నురగ ఇలా గాల్లోకి తేలినట్లు స్పష్టమవుతోంది. గతంలో కూడా పలు పట్టణాల్లో ఇలాంటి నురుగు రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చిన సంఘటనలు చూసే ఉంటాం. ఇది కూడా ఆ జాబితాలోకే వస్తుంది. కాబట్టి మేఘాలు కింద పడుతున్నాయన్న దాంట్లో ఏమాత్రం నిజం లేదు.
గతంలో బెంగళూరులో
గత కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఇలాంటి దృశ్యం నగర పౌరులను ఆశ్చర్యానికి గురి చేసింది. వర్షం కురిసిన తర్వాత రోడ్లపై ఆకస్మాత్తుగా తెల్లటి నురుగు కనిపించింది. ఇది ఎలా ఏర్పడిందో ఎవరికీ అర్థం కాలేదు. అచ్చంగా మంచు కురిసినట్లు కనిపించింది.
ఇది కూడా పారిశుధ్య సమస్యల వల్ల లేదా కాలుష్యభరితమైన కాలువల వల్ల ఈ నురుగు ఏర్పడిందని అప్పట్లో అధికారులు తెలిపారు.