- Home
- Entertainment
- VV Vinayak: రాఘవేంద్రరావు రిజెక్ట్ చేసిన పాటతో చంద్రబోస్ నంది అవార్డు గెలిచాడు.. వినాయక్ కామెంట్స్
VV Vinayak: రాఘవేంద్రరావు రిజెక్ట్ చేసిన పాటతో చంద్రబోస్ నంది అవార్డు గెలిచాడు.. వినాయక్ కామెంట్స్
VV Vinayak: దర్శకుడు వి.వి. వినాయక్ తన మొదటి సినిమా 'ఆది' నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చంద్రబోస్ రాసిన ఒక పాటను వేరే దర్శకుడు రిజెక్ట్ చేస్తే, ఆ పాటను తాను దర్శకుడినయ్యాక తీసుకుంటానని మాట ఇచ్చి..

ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన..
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తన సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా తన మొదటి చిత్రం 'ఆది'లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన "నీ నవ్వుల తెల్లదనాన్ని" పాట వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీని ఆయన వెల్లడించారు.
చంద్రబోస్ రిజెక్ట్ చేసిన పాట..
వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో చంద్రబోస్ తనకు చాలా క్లోజ్ అని తెలిపారు. ఒకరోజు చంద్రబోస్ ఒక పాట రాసి, అది వేరే దర్శకుడికి నచ్చక రిజెక్ట్ చేయడంతో చాలా బాధగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆ పాట పల్లవి వినగానే వినాయక్ ఫిదా అయిపోయి.. "బోస్ గారు, ఈ పాట ఎవరికీ ఇవ్వకండి. నేను దర్శకుడినైనప్పుడు నా మొదటి సినిమాలో ఈ పాట కచ్చితంగా ఉంటుంది" అని మాట ఇచ్చారు.
'ఆది'లో ఫస్ట్ రికార్డింగ్ సాంగ్.. నంది అవార్డు!
చెప్పినట్లుగానే వినాయక్ 'ఆది' సినిమా అవకాశం రాగానే, మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో మొదటగా రికార్డ్ చేసిన పాట ఇదే. ఆ పాట ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విశేషమేమిటంటే, అప్పటికే ఎన్నో హిట్ పాటలు రాసిన చంద్రబోస్‌కి, ఈ "నీ నవ్వుల తెల్లదనాన్ని" పాటకే మొదటిసారి 'నంది అవార్డు' లభించడం గమనార్హం.
పరుచూరి బ్రదర్స్ - పరిశ్రమకు నిజమైన సేవకులు
వినాయక్ పరుచూరి బ్రదర్స్ గురించి మాట్లాడుతూ, వారు తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. దాదాపు 300-400 సినిమాలకు పేరు పడితే, పేరు పడకుండా వారు సహాయం చేసిన సినిమాలు మరో 200 వరకు ఉంటాయని వెల్లడించారు. ఎక్కడైనా కథ ఆగిపోయినప్పుడు పెద్ద డైరెక్టర్లు కూడా వారిని అప్రోచ్ అయ్యేవారని, వారు ఏనాడూ రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయలేదని వినాయక్ గుర్తు చేసుకున్నారు.
మాస్ డైలాగుల వెనుక ఉన్న కథ
'ఆది' సినిమాలో ఫేమస్ అయిన "అమ్మతోడు అడ్డంగా నరికేస్తా", "బాంబు చుట్టింది మా తాత" వంటి డైలాగులు తాను కథ చెప్పినప్పుడే పుట్టాయని వినాయక్ తెలిపారు. పరుచూరి బ్రదర్స్ తన కథ విని, "నువ్వు చెప్పినట్లుగానే ఉంచు, దీన్ని పాడు చేయకు" అని ప్రోత్సహించడం తనలో ఎంతో కాన్ఫిడెన్స్ నింపిందని ఆయన వివరించారు.

