Sanath Jayasuriya: 36 బౌండరీలు, 340 రన్స్ తో విధ్వంసం రేపాడు
Sanath Jayasuriya: శ్రీలంక గ్రేట్ లెజెండరీ బ్యాటర్ సనత్ జయసూర్య 36 బౌండరీలతో 340 పరుగులతో విధ్వంస రేపాడు. భారత్‌పై 799 నిమిషాల అజేయ ఇన్నింగ్స్ ఆడి టెస్టు చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ ను నమోదుచేశారు.

క్రికెట్ చరిత్రలో అపురూప ఘట్టం.. సనత్ జయసూర్య పరుగుల సునామీ
శ్రీలంక మాజీ కెప్టెన్, ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడే లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య తన 56వ పుట్టినరోజు (జూన్ 30, 2025) జరుపుకుంటున్నారు. అయితే, జయసూర్య తన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచే ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు.
ఆయన బర్త్ డే సందర్భంగా మరోసారి క్రికెట్ ప్రపంచం జయసూర్య సునామీ నాక్ లను గుర్తు చేసుకుంటోంది. 1997లో కోలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై ఆయన 340 పరుగుల దుమ్మురేపే ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించారు. ప్రపంచ క్రికెట్ లో ఈ ఇన్నింగ్స్ తో మరోసారి తన బ్యాటింగ్ పవర్ ను చూపించాడు.
జయసూర్య ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో 952/6 పరుగులు చేసిన శ్రీలంక
సనత్ జయసూర్య ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 952/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇది టెస్టు చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక టీమ్ స్కోరు. జయసూర్య ఇన్నింగ్స్‌కు తోడు రోషన్ మహానామ (225 పరుగులు), అరవింద డిసిల్వా (126 పరుగులు), మహేల జయవర్ధనే (66 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ లతో లంకేయులు భారీ స్కోరు సాధించారు.
భారత్‌కు తప్పని కష్టాలు
ఈ మ్యాచ్ లో భారత జట్టు మొదట బ్యాటింగ్‌చేసి 537/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో నవజ్యోత్ సింగ్ సిద్దూ (111 పరుగులు), సచిన్ టెండూల్కర్ (143 పరుగులు), మహ్మద్ అజహరుద్దీన్ (126 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు.
అయితే, శ్రీలంక జట్టు స్పందన ఆరంభంలోనే పరుగుల కోసం ఇబ్బందిపడినా.. ఆ తర్వాత జయసూర్య, మహానామ కలసి అద్భుతమైన భాగస్వామ్యంతో శ్రీలంకను భారీ స్కోర్ దిశగా మందుకు నడిపించారు. సనత్ జయసూర్య ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయిన గొప్ప నాక్ గా నిలిచింది.
సనత్ జయసూర్య ఇన్నింగ్స్ ప్రత్యేకతలు ఇవే
సనత్ జయసూర్య 578 బంతులు ఆడి మొత్తం 340 పరుగులు చేశారు. తన ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్ లో 36 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు. మొత్తం 799 నిమిషాల పాటు క్రీజులో ఉన్నారు.
జయసూర్య టెస్టు కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోరు. టెస్టు చరిత్రలో శ్రీలంక ఆటగాడి పరంగా రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు ను జయసూర్య నమోదుచేశారు. మొత్తంగా శ్రీలంక తరఫున అత్యధిక స్కోర్ మహేల జయవర్ధనే 374 పరుగులతో టాప్ లో ఉన్నాడు.
సనత్ జయసూర్య ట్రిపుల్ సెంచరీ మ్యాచ్ ఫలితమేంటి?
మ్యాచ్ ఐదవ రోజుకు చేరుకునే సమయానికి శ్రీలంక భారీ స్కోరు నమోదు చేసిన తర్వాత, ఇక మ్యాచ్‌ను డిక్లేర్ చేయడంతో చివరికి మ్యాచ్ డ్రా గా ముగసింది. ఈ ఇన్నింగ్స్‌తో జయసూర్య తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఒకే విధంగా దూకుడైన ఆటతీరుతో రాణించిన సనత్ జయసూర్య, తక్కువ సమయానికే ఎక్కువ పరుగులు చేయడంలో దిట్ట. ఆయన క్రికెట్ స్టైల్ విరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచింది.
సనత్ జయసూర్య 340 పరుగుల ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్‌లోనే కాదు, మొత్తం క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ ఘనత ఇప్పటికీ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. 56వ పుట్టినరోజున జయసూర్యకు ఈ ఇన్నింగ్స్ మరొక గౌరవ గుర్తుగా నిలిచింది.