new Rs 20 notes: మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు.. పాత నోట్లు చెల్లవా?
RBI to release new Rs 20 notes: కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ. 20 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించింది.

RBI to release new Rs 20 notes with Sanjay Malhotra signature
RBI to release new Rs 20 notes: కొత్త 20 రూపాయల నోట్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సంచలన ప్రకటన చేసింది. మహాత్మా గాంధీ ఫొటోతో (న్యూ) సిరీస్‌లో భాగంగా గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త ₹20 విలువ గల కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు శనివారం ఒక అధికారిక ప్రకటనలో ఆర్బీఐ ఈ వివరాలు వెల్లడించింది. ఈ నోట్ల రూపకల్పన, రంగు, భద్రతా లక్షణాలు గత సిరీస్‌లో విడుదలైన రూ.20 నోట్ల మాదిరిగానే ఉంటాయని తెలిపింది.
RBI Governor Sanjay Malhotra
ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11, 2024న 26వ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ సంతకం మార్పు మొదటి చర్యగా నమోదవుతోంది.
రూ.20 కొత్త నోట్ల ముఖ్యాంశాలు:
63 మిమీ x 129 మిమీ పరిమాణంలో ఆకుపచ్చ పసుపు కలయిక రంగులో ఉండనుంది. ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రపటం, దేవనాగరి లిపిలో అంకె, గవర్నర్ సంతకం, ఆర్‌బీఐ లోగో, జాతి ప్రతీక (అశోక స్తంభం), మైక్రోలెటరింగ్ ఉంటాయి. అలాగే, భద్రతా థ్రెడ్ పై 'भारत, RBI' అక్షరాలు ఉంటాయి. ఇక వెనుక భాగంలో ఎల్లోరా గుహలు చిత్రాన్ని మోటిఫ్‌గా వాడడం, నోటు ముద్రించిన సంవత్సరం, భాషా ప్యానెల్, స్వచ్ఛ భారత్ లోగో ఉండనున్నాయని సమాచారం.
The Reserve Bank of India
ఈ మార్పు కేవలం గవర్నర్ సంతకానికే పరిమితమవుతుంది. మిగిలిన అన్ని అంశాలు 2019లో విడుదలైన మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్ రూ.20 నోట్లలాగే ఉంటాయి. ఈ మార్పు వల్ల ATMలు, CDMలు, నోట్ కౌంటింగ్ యంత్రాలు సహజంగానే కొనసాగుతాయనీ, ఎలాంటి మార్పులు అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది.
The Reserve Bank of India - banknotes
పాత రూ.20 నోట్లు చెల్లుతాయా? లేదా?
మహాత్మా గాంధీ సిరీస్ (న్యూ) కింద ఉన్న పాత రూ.20 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయి. ఈ కొత్త నోట్లతో పాటు పాత నోట్లు కూడా చెల్లుబాటు అయ్యే నోట్లుగా కొనసాగుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రజలు వాటిని మార్చాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఆర్‌బీఐ ఈ కొత్త నోట్ల గురించి అవగాహన పెంచేందుకు భాషాపరంగా విస్తృత ప్రచారం, సోషల్ మీడియా, కమ్యూనిటీ రేడియో ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొంది.
indian denomination banknotes
కాగా, గవర్నర్ సంతకాన్ని అన్ని నోట్లపై మార్చడం అనేది ఒక క్రమమైన పద్ధతి. ఇది సాధారణంగా తక్కువ విలువ కలిగిన నోటుతో మొదలవుతుంది. పాత గవర్నర్ సంతకం ఉన్న నోట్లు చలామణిలో ఉండగానే, కొత్త గవర్నర్ సంతకం ఉన్న నోట్లను ముద్రించి విడుదల చేస్తారు. పాత నోట్ల నిల్వలు అయిపోయిన తర్వాత, క్రమంగా వాటి స్థానంలో కొత్త నోట్లు వస్తాయి.
గతంలో ఇలాంటి మార్పులు జరిగినప్పుడు, ఎక్కువ విలువ కలిగిన నోట్లపై పాత గవర్నర్ సంతకం చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. దీనికి కారణం ఏమిటంటే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఖర్చును తగ్గించడం, లాజిస్టిక్‌లను సులభతరం చేయడం వంటి విధానాలను అనుసరిస్తుంది.