BLDC ఫ్యాన్లు కరెంట్ లేకపోయినా తిరుగుతాయా? కరెంట్ బిల్లు అంత తగ్గుతుందా?
ఈ వేసవిలో మీ ఇంటి కరెంట్ బిల్ తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లో ఉండే ఫ్యాన్‌ను BLDC ఫ్యాన్‌గా మార్చేయండి. ఇది సాధారణ ఎలక్ట్రిక్ ఫ్యాన్‌తో పోలిస్తే తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా పనితీరులోనూ ది బెస్ట్ గా ఉంటుంది. ఇటీవల చాలా మంది వినియోగదారులు BLDC టెక్నాలజీపై మొగ్గుచూపుతున్నారు. అసలు BLDC టెక్నాలజీ గురించి, ఈ ఫ్యాన్స్ పనితీరు గురించి వివరంగా తెలుసుకుందాం రండి.

BLDC అంటే బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్(Brushless Direct Current) ఫ్యాన్. దీనిలో సాధారణ మోటార్‌ల్లో ఉండే బ్రష్ ఉండదు. దీనికి బదులుగా ఈ ఫ్యాన్‌లో ఎలక్ట్రానిక్ కంట్రోలర్ ద్వారా మోటార్ పనిచేస్తుంది. ఇది DC మోటార్‌ను ఉపయోగిస్తుంది. అందుకే విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. AC మోటార్‌తో పనిచేసే ఫ్యాన్‌కి కరెంట్ ఎక్కువ అవసరం. ప్రస్తుతం మన ఇళ్లలో ఉండే ఫ్యాన్స్ అన్నీ ఏసీ మోటార్ తో పనిచేసేవే.
ఒక్క యూనిట్ ఖర్చు చేస్తే 28 గంటలు పనిచేస్తాయి..
విద్యుత్ వినియోగ పరంగా చూస్తే BLDC ఫ్యాన్ సగటున 24 నుండి 35 వాట్స్ వరకు మాత్రమే ఖర్చుచేస్తుంది. సాధారణ ఫ్యాన్ అయితే 50 నుంచి 100 వాట్స్ వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. అంటే ఒక యూనిట్ విద్యుత్తుతో BLDC ఫ్యాన్ 25 నుంచి 28 గంటల వరకూ నడుస్తుంది. కానీ సాధారణ ఫ్యాన్ మాత్రం అదే విద్యుత్తుతో కేవలం 6.5 నుంచి 10 గంటల వరకే నడుస్తుంది. దీని అర్థం BLDC ఫ్యాన్ మూడింతలు ఎక్కువ ఎనర్జీ ఎఫిషియెన్సీ కలిగి ఉందన్న మాట.
సౌండ్ చేయని ఫాన్స్ ఇవి..
సౌండ్ పరంగా చూస్తే BLDC ఫ్యాన్ బ్రష్ లేకుండా పనిచేస్తున్నందున దాదాపు 32 డెసిబెల్ మాత్రమే శబ్దం చేస్తుంది. ఇది చాలా కూల్ గా ఉంటుంది. ఈ ఫ్యాన్‌లు ఇన్వర్టర్‌కు అనుకూలంగా ఉంటాయి. అంటే కరెంట్ పోయినా ఎక్కువ సేపు నడుస్తాయి. పైగా ఇందులో చివరిసారిగా ఉపయోగించిన స్పీడ్, మోడ్, లైట్ కలర్ వంటి అంశాలను గుర్తుంచుకునే స్మార్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. మళ్ళీ ఆన్ చేసినప్పుడు అవే సెట్టింగ్స్‌కి తిరిగి వస్తుంది.
BLDC ఫ్యాన్‌కి సాధారణ ఫ్యాన్ కి మధ్య తేడాలు
విద్యుత్ వినియోగం విషయంలో BLDC ఫ్యాన్స్ 28–35 వాట్స్ విద్యుత్తును వినియోగిస్తే సాధారణ ఫ్యాన్స్ 50–100 వాట్స్ వినియోగిస్తాయి. BLDC ఫ్యాన్స్ 7నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తాయి. సాధారణ ఫ్యాన్స్ 5 నుంచి 6 సంవత్సరాలు పనిచేస్తాయి. BLDC ఫ్యాన్స్ ఇన్వర్టర్ ను కలిగి ఉంటాయి. అంటే కరెంట్ పోయినా పనిచేస్తాయి. సాధారణ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా ఇన్వెర్టర్ కనెక్షన్ ఇవ్వాలి. BLDC ఫ్యాన్స్ లో ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అయితే వీటి ధర రూ.3,000 నుంచి రూ7,000 మధ్య ఉంటాయి. అదే సాధారణ ఫ్యాన్స్ లో ఎలాంటి స్మార్ట్ ఫీచర్లు ఉండవు. అందుకే వీటి ధర రూ.1,200 నుంచి రూ.1,800 మధ్య ఉంటాయి.
కరెంట్ బిల్లు తగ్గాలంటే BLDC ఫ్యాన్ బెస్ట్
ధర కొంత ఎక్కువగా ఉన్నా, దీర్ఘకాలికంగా చూసినప్పుడు BLDC ఫ్యాన్ విద్యుత్తు పొదుపు, తక్కువ శబ్దం, స్మార్ట్ ఫీచర్లు వంటి ప్రయోజనాల వల్ల మంచి పెట్టుబడిగా మారుతుంది. కరెంట్ బిల్లును తగ్గించాలనుకునే ప్రతి ఇంటికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.