- Home
- Andhra Pradesh
- Amaravati: అమరావతి భవితవ్యం మార్చేలా.. రూ. 49 వేల కోట్లతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Amaravati: అమరావతి భవితవ్యం మార్చేలా.. రూ. 49 వేల కోట్లతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరవాతికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమరావతిపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ చేతుల మీదుగా జరగనున్న శంకుస్థాపనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

2015 అక్టోబరులో మొట్టమొదటిసారి శంకుస్థాపన చేసిన మోదీ, ఇప్పుడు పునఃప్రారంభ కార్యక్రమానికి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు విస్తృత ప్రణాళికను సిద్ధం చేసింది.
ప్రాజెక్టులకు శంకుస్థాపనలు:
వెలగపూడిలో 250 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్వీసు అధికారుల నివాస సముదాయాలకు నిర్మాణాలకు ప్రారంభం కానుంది. అంతేకాదు, DRDO, DPIIT, NHAI, రైల్వేలకు చెందిన రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులూ ప్రారంభమవుతాయి. అలాగే నాగాయలంకలో రూ.1,500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు మోదీ శంకుస్థాపన చేస్తారు.
గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్‌తో అభివృద్ధి:
అమరావతిలో 30 శాతం పచ్చదనాన్ని పెంచేందుకు గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. నీటి ప్రవాహానికి ప్రాధాన్యం, భూగర్భ కారిడార్ల ద్వారా నీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ వంటి అవసరాలను సమర్థంగా నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 3300 కిలోమీటర్ల సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు, సమగ్ర రహదారి అనుసంధాన వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.
మౌలిక సదుపాయాలు, సంస్థలు:
ఇప్పటికే రూ.30,885 కోట్ల పెట్టుబడులు అమరావతిని వైపు మొగ్గుచూపాయి. విద్యారంగంలో బిట్స్, ఎక్స్‌ఎల్ఆర్ఐ, విట్, వైద్యరంగంలో ఈఎస్ఐ, బసవతారకం, ఎల్వీ ప్రసాద్ వంటి సంస్థలు ముందుకొచ్చాయి. హిల్టన్, మారియట్ వంటి హోటళ్లు, ఆర్బీఐ, నాబార్డ్, యూనియన్ బ్యాంక్ వంటి బ్యాంకులు కార్యాలయాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నాయి.
భవిష్యత్తు కేంద్రంగా అమరావతి:
అమరావతిలో దేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సీఐఐ ఆధ్వర్యంలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ వంటి ఆధునిక సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతిని ఒక ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
ఏర్పాట్లపై సమీక్ష:
ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. వర్షం వస్తే పార్కింగ్‌కి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారని చెప్పారు. 3,000 బస్సులు, 1,000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు జరిగాయని, మరోవైపు 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో అదనపు స్థలాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి