మంచు విష్ణు, మోహన్‌ బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` చిత్రం నుంచి ట్రైలర్‌ వచ్చింది. మరి ఈ ట్రైలర్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది చూద్దాం. 

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `కన్నప్ప`. మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌, శరత్ కుమార్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తుండటం విశేషం. ముకేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ విడుదలయ్యింది.

`కన్నప్ప` ట్రైలర్‌ని చూస్తే, గూడెంలో శివలింగం ఉంటుంది. దాన్ని వాయు లింగంగా పిలుస్తారు. ఆ లింగాన్ని దొంగిలించేందుకు చాలా మంది ప్రత్యర్థులు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ వాయు లింగం కాపాడేందుకు తిన్నడు(మంచు విష్ణు) కంకణం కట్టుకుంటాడు. తిన్నడిని దాటి వాయు లింగాన్ని తీసుకెళ్లడం అసాధ్యంగా మారుతుంది. ఆ లింగం కోసం వచ్చిన వారిని మట్టు పెడుతుంటాడు తిన్నడు. అదే సమయంలో ఆ గూడెం ప్రజలకు రక్షణగా ఉంటాడు తిన్నడు.

అయితే ఆ లింగాన్ని మాత్రం తిన్నడు రాయిగానే భావిస్తాడు. దేవుడు లేడు అంటుంటాడు. చిన్నప్పట్నుంచి అతనిది అదే పంతం. తన ప్రియురాలితోనూ అలానే మాట్లాడుతుంటాడు. ఓ దశలో ఆ రాయిని అక్కడి నుంచి తీసేస్తే గానీ సమస్యలు పరిష్కారం కావు అంటుంటాడు. అలాంటి సాహసానికి దిగే క్రమంలో తిన్నడిలో భక్తిని పెంచడానికి రుద్ర(ప్రభాస్‌) భూమిపైకి పంపిస్తాడు శివుడు(అక్షయ్‌ కుమార్‌).

తిన్నడి వద్దకు వెళ్లిన రుద్ర తిన్నడిలో మార్పు తెస్తాడు. భక్తి ఏంటో? శివుడు పవర్‌ ఏంటో? ధైవత్వం, శివతత్వం ఏంటో చెబుతాడు. అనంతరం శివుడికి భక్తుడవుతాడు తిన్నడు. శివలింగాన్ని వదిలి ఉండలేనని చెబుతాడు. ట్రైలర్‌ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. యాక్షన్ సీన్లు కూడా బాగున్నాయి. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. బీజీఎం ఇంకా బాగా చేయాల్సింది. 

శివ లింగం చుట్టూనే కథ సాగుతున్నట్టుగా ఉంది. శివుడంటే లెక్కలేని తిన్నడికి ఆ శివతత్వంలోని గొప్పతనాన్ని చాటి చెప్పడం, ఆ శివలింగాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ మూవీ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. పూర్తి యాక్షన్‌, వీరోచితమైన అంశాలకు ప్రయారిటీ ఇవ్వకుండా భావోద్వేగాల సమాహారంగా ట్రైలర్ ని కట్‌ చేయడం కొత్తగా ఉంది. 

`కన్నప్ప` చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. మంచు విష్ణు, మోహన్‌బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని తెరకెక్కిస్తున్నారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. పైగా భారీ కాస్టింగ్‌తో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.

YouTube video player