IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్-బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ 2025 ఫైనల్‌ను గెలవడానికి విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
RCB vs PBKS IPL 2025 Final: ప్రతి సీజన్ లాగే ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఐపీఎల్ 2025 చివరకు గ్రాండ్ ఫినాలే దశకు చేరుకుంది. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నాయి. తమ జట్టు గెలుస్తుందంటే.. తమ జట్టే గెలుస్తుందని అభిమానులు, సపోర్టర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ తో తమ అభిమాన జట్లకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో గెలిచి ట్రోఫీ అందుకునే జట్టుగా ఆర్సీబీ స్పష్టమైన ఆధిక్యంతో ఫెవరెట్‌గా ఉంది. అందుకు ఈ ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి..

1. అనుభవంతో కూడిన ప్రపంచ స్థాయి జట్టు
ఆర్సీబీ జట్టులో ప్రపంచ కప్‌లు గెలిచినవారితో పాటు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన స్టార్ ప్లేయర్లు ఉన్నారు. జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా వంటి ఆటగాళ్లు కీలక సందర్భాల్లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. సుయాష్ శర్మ క్వాలిఫయర్ 1లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. విరాట్ కోహ్లీ అనుభవం మళ్లీ జట్టుకు అండగా ఉంది. ఈ సీజన్ లో పరుగుల వరదపారిస్తున్నాడు. ఇక పంజాబ్ జట్టు మాత్రం ఎక్కువగా యంగ్ ప్లేయర్లతో ఉంది. వీరిలో ఐదుగురు ఆటగాళ్లు ఇంకా అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడలేదు.

2. హేజిల్‌వుడ్ వర్సెస్ శ్రేయాస్ అయ్యర్
ఈ సీజన్‌లో అత్యుత్తమ కెప్టెన్, ఆటగాడిగా నిలిచిన శ్రేయాస్ అయ్యర్‌పై హేజిల్‌వుడ్ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఐపీఎల్ లో 11 ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు అయ్యర్ ను అవుట్ చేశాడు. ఇదే సీజన్‌లో 3 మ్యాచ్‌లలో రెండు సార్లు అయ్యర్‌ను ఔట్ చేశాడు. క్వాలిఫయర్ 1లో అయ్యర్ దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఫైనల్‌లో కూడా హేజిల్‌వుడ్ అతనిపై అదే ఒత్తిడిని తీసుకురావచ్చు.

3. కోహ్లీ.. రన్ మిషన్, ఫైటింగ్ స్పిరిట్
విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఇప్పటిదాకా 3 ఫైనల్స్ ఆడాడు. 3 మ్యాచ్ లను కోల్పోయాడు. ఈసారి 600పైగా రన్స్ చేయడం ద్వారా తన ఐపీఎల్ ట్రోఫీ ఆకలి ఏ స్థాయిలో ఉందో చూపించాడు. ఈ సీజన్‌లో ఇతర బ్యాట్స్‌మెన్ సహకారం అందిస్తుండటంతో కోహ్లీ తన సహజ ఆటతీరు కనబరుస్తూ మంచి ఇన్నింగ్స్ లను ఆడుతున్నాడు. అతని పరుగుల దాహం, ఫైటింగ్ స్పిరిట్ ఆర్సీబీని మరింత బలంగా మార్చింది.

4. సూపర్ ఫామ్.. మోమెంటమ్
ఆర్సీబీ గత ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. పంజాబ్ తో జరిగిన 3 మ్యాచ్ లలో రెండు సార్లు విజయం సాధించింది. ముఖ్యంగా క్వాలిఫయర్ 1లో పంజాబ్‌ను 101 పరుగులతో ఓడించడం మానసికంగా ఆర్సీబీ పైచేయి సాధించగల జట్టుగా ముందుంది. భారీ తేడాతో ఓడిపోయి మళ్లీ బిగ్ ఫైట్ కు రావడం పంజాబ్ ను ఇంకా కలవరపెడుతూనే ఉందని చెప్పవచ్చు.

5. పంజాబ్ బౌలింగ్‌లో లోపాలు
పంజాబ్ బౌలింగ్ లైనప్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఎందుకంటే యూజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ మినహా ఇతర బౌలర్లు స్థిరంగా రాణించలేదు. కైల్ జేమిసన్ స్థిరంగా రాణించడం లేదు. వైశాఖ విజయ్‌కుమార్ కు పెద్దగా అనుభవం లేదు. స్టోయినిస్, ఒమర్జాయ్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే, వీరు ఫైనల్ మ్యాచ్ లో ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి.
అన్ని విభాగాల్లో బలంగా ఆర్సీబీ
ఆర్సీబీ విషయానికి వస్తే బౌలింగ్ విభాగం బలంగా ఉంది. జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ స్టార్ పేసర్లు రాణిస్తున్నారు. అలాగే, సుయాష్ శర్మ స్పిన్నర్‌గా, కృనాల్ పాండ్యా మిడిల్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా కంట్రోల్ చేస్తున్నాడు. ఇక బ్యాటింగ్ లో కూడా ఆర్సీబీ బలమైన జట్టుగా ఉంది. భారీ అంచనాలున్నా.. తుది పోరులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందే !
