తిరుమలలో మే 1 నుండి విఐపి బ్రేక్ దర్శన వేళలు మారాయి. సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. కాబట్టి తిరుమలకు వెళ్లే భక్తులు ఓసారి ఈ దర్శనవేళల గురించి తెలుసుకొండి. 

Tirumala : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు ప్రతిరోజు వేలాదిమంది వెళుతుంటారు... కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి దర్శనంకోసం గంటలకు గంటలు క్యూలైన్లలో ఎదురుచూస్తుంటారు. సామాన్య భక్తులే కాదు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సైతం స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చే విఐపిల కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా తాజాగా తిరుమల తిరుపతి దేశస్థానం (TTD) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విఐపి బ్రేక్ దర్శనాల వేళలను మార్చింది... మే 1 అంటే ఇవాళ్టి నుండే మారిన వేళలు అమల్లోకి రానున్నాయి. 

తిరుమలలో కొత్త దర్శన వేళలివే :

గత వైసిపి ప్రభుత్వం తిరుమలలో దర్శన వేళల్లో మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. విఐపి బ్రేక్ దర్శనాలు తెల్లవారుజామున ఉండగా దాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. తాజాగా కూటమి ప్రభుత్వం గతంలో మాదిరిగానే తెల్లవారుజామున విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. ఈమేరకు కొత్త దర్శన వేళలను ప్రకటించారు... ఇవాళ్టి నుండి ఇది అమల్లోకి రానుంది. 

తెల్లవారుజామున 5.45 గంటలకు ప్రోటోకాల్, 6.30 గంటలకు రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు కల్పించనున్నారు. ఇక ఉదయం 6.45 కు జనరల్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఇలా ఉదయం 7.30 గంటలలోపు బ్రేక్ దర్శనాలు పూర్తిచేయడం ద్వారా రోజంతా సామాన్య భక్తులు ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా దర్శనం కల్పించవచ్చనేది టిటిడి ఆలోచన. 

ఇక ఉదయం 10 గంటల తర్వాత మరోసారి బ్రేక్ దర్శనాలను కల్పించనున్నారు. ఉదయం 10.15 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 10.30 గంటలకు ఇతర దాతలు, ఉదయం 11 గంటలకు టిటిడి రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనవేళలను భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 

ఇవాళ్టి నుండి తిరుమలలో సిపారసు లేఖలు పనిచేయవు :

తిరుమలలో మే 1 నుండి ప్రజాప్రతినిధులు, టిటిడి బోర్డ్ మెంబర్స్ సిపారసు లేఖల బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. వేసవిలో భక్తుల రద్దీ నేపథ్యంలో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రోటోకాల్ వీఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు టిటిడి ప్రకటించింది.

అయితే ఇప్పటికే సిపారసు లేఖలు పొందినవారికి యధావిధిగా బ్రేక్ దర్శనం కల్పిస్తామని టిటిడి బోర్డ్ సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో భక్తులకు అనుమతి యధాతధంగా ఉంటుందని... బోర్డు సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలతో దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకులేఖలు తీసుకున్న భక్తులకు యధావిధిగా దర్శనాలు కల్పిస్తాం... ఇకపై లేఖలు తీసుకునే వారికి మాత్రం అనుమతించబోమని జ్యోతుల నెహ్రూ తెలిపారు.