ఆంధ్రప్రదేశ్‌లోని సింహాద్రి అప్పన్న ఆలయంలో మాటలకందని విషాదం చోటు చేసుకుంది. దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ సంఘనటలో మరికొంత మందికి తీవ్రగాలయ్యాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
అప్పన్న సన్నిధిలో చందనోత్సవ సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. రూ.300 టికెట్ క్యూలైన్‌లో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వారు మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే హోమంత్రి అనిత రంగంలోకి దిగారు సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడ కూలిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో ఉన్న కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది. గోడ భారీగా ఉండడంతో శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక టీమ్స్ పాల్గొన్నాయి.
ఇదిలా ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందు జాగ్రతలో భాగంగా సంఘటన స్థలంలో 10 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
ఇదిలా ఉంటే ఏంటా ఒక్కసారిగా మాత్రమే నిర్వహించే సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. కేవలం ఏపీ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వస్తుంటారు. బుధవారం సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకోనున్నారని అంచనా. అర్థరాత్రి నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
కలచి వేసింది: సీం చంద్రబాబు
ఈ సంఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం కలిచి వేసిందన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని, గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఈ విషాద సంఘటనపై చంద్రబాబు ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
మోదీ దిగ్భ్రాంతి
సింహాచలంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇక ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి కేంద్రం తరపున రూ. 50 వేలు అందిస్తామని ప్రకటించారు.
