అమ‌రావ‌తి పునఃనిర్మాణ పనుల ప్రారంభంతోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది. ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న స్పీచ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో తెలుగులో మాట్లాడారు. అమ‌రావ‌తి కేవ‌లం ఒక న‌గ‌రం మాత్ర‌మే కాద‌ని ఒక శ‌క్తి అని అభివ‌ర్ణించారు. చంద్ర‌బాబు మీద త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపారు.  

మూడేళ్ల‌లో అమ‌రావ‌తి పూర్తి అవుతుంది: 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుపై తనకు పూర్తి నమ్మకముందని చెప్పారు. అమరావతిలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి అయితే రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది: 

పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పూర్తి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఒకప్పుడు ఏపీ-తెలంగాణకు కలిపి రూ.900 కోట్ల రైల్వే బడ్జెట్ ఉండేదని, ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.9,000 కోట్ల కేటాయించామని తెలిపారు. ఈ రైల్వే ప్రాజెక్టులు కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక, పర్యాటక రంగాలకు దోహదం చేస్తాయని అన్నారు.

అంతరిక్ష పరిశోధనలో ఆంధ్రప్రదేశ్ కీలకం

భారత అంతరిక్ష ప్రయోగాల పర్యావరణంగా ఏపీ కీలక భూమిక పోషిస్తోందని ప్రధాని చెప్పారు. శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాలు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. నాగాయలంకలో డీఆర్‌డీవో మిస్సైల్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

అభివృద్ధి కార్యాచరణకు చంద్రబాబు అవసరం: మోదీ

వికాసం కోసం మొదలుపెట్టిన కార్యాచరణను వేగంగా పూర్తి చేయగల నాయకుడు చంద్రబాబేనని ప్రధాని అన్నారు. మంచి పనులకు శ్రీకారం చుట్టడం, వాటిని విజయవంతంగా పూర్తి చేయడం చంద్రబాబుకు సాధ్యమని ప్రశంసించారు. “ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మైలురాళ్లు,” అని పేర్కొన్నారు.