Chandrababu Naidu: అమరావతి రాజధాని అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్ల‌డించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమ‌రావ‌తిపై చేసిన కామెంట్స్ రాష్ట్ర అభివృద్ధికి నూతన నమ్మకాన్ని అందించాయన్నారు. సభ విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకమైందనీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. 

Amaravati Relaunch: ఆంధ్రప్రదేశ్ రాజకీయ, భౌగోళిక భవిష్యత్తుకు కీలకమైన అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమం ఏప్రిల్ 30న చారిత్రాత్మకంగా జరిగింది. అమ‌రావ‌తి రీలాంచ్ స‌భ స‌క్సెస్ అయింద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న టెలీకాన్ఫరెన్స్ ద్వారా కూట‌మి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో స‌మావేశ‌మ‌య్యారు. 

ప్రధాని మాటలే మాకు ప్రేరణ: చంద్ర‌బాబు 

ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి పనులు పునఃప్రారంభించడం వెనుక ఉద్దేశం స్ప‌ష్టం చేస్తూ.. అమరావతి అవసరాన్ని దేశానికి తెలియజేయడంగా చెప్పారు. మోడీ అమ‌రావ‌తి పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రానికి ధైర్యాన్నిచ్చాయని ఆయన అన్నారు. ప్రధాని మోడీ అమ‌రావ‌తి రీలాంచ్ లో మ‌ట్లాడుతూ.. అమరావతి ఒక నగరం కాదు... అది ఒక శక్తి, రాష్ట్ర వృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతుంది, దేశానికి రోల్ మోడల్‌గా అమరావతి నిలవాలి అంటూ కామెంట్స్ చేశారు. 

ప్రజల భాగస్వామ్యమే సక్సెస్ మంత్ర : చంద్ర‌బాబు 

అమ‌రావ‌తి రీలాంచ్ కు విజయానికి ప్రధాన కారణం ప్రజల భాగస్వామ్యమ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే వేదికపై ఉత్సాహంగా పాల్గొనడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ సమన్వయాన్ని చూపిస్తుందన్నారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల కృషిని కొనియాడారు. బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా పని చేశార‌న్నారు. లక్షల మంది వచ్చినా ఎక్కడా ఇబ్బందులు ప‌డ‌లేద‌ని చెప్పారు. మ‌రోసారి మూడు సంవత్సరాల్లో రాజ‌ధాని నిర్మాణాలు పూర్తవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. మేము లక్ష్యం మేరకు అన్ని పనులు పూర్తిచేస్తామ‌ని చెప్పారు.