Miss World 2025 Event: మిస్ వరల్డ్ పోటీల వేదికపై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని గ్లోబల్ స్థాయిలో ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మే 10 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో 120 దేశాల ప్రాతినిధ్యం ఉండగా, 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.  

Miss World 2025 Event: మిస్ వరల్డ్ పోటీని ప్రపంచ వేదికగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను ఉపయోగించుకునే ప్రణాళికలు రూపొందించింది. 120 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్న ఈ ఈవెంట్‌ను 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

ఈ క్ర‌మంలోనే మిస్ వ‌ర‌ల్డ్ వేదిక‌ను ఉప‌యోగించుకుని చార్మినార్, చౌమహల్లా, రామప్ప వంటి ప్రదేశాల్లో వారసత్వ పర్యటనలు, పోచంపల్లి చేనేత, మెడికల్ టూరిజం, షిల్పారామంలో కళల కార్యశాలలు, ఐపిఎల్ మ్యాచ్ తదితర అంశాల ద్వారా తెలంగాణ ప్రత్యేకతను చూపించాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు చేసింది. అలాగే, ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడులు, పర్యాటకం, ఉద్యోగావకాశాలు పెరిగేలా రాష్ట్రం కృషి చేస్తోంది.

మిస్ వరల్డ్ వేదికపై తెలంగాణ సంస్కృతి

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మిస్ వరల్డ్ పోటీలు ఈసారి భారతదేశం వ‌చ్చాయి. అది కూడా మ‌న తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించ‌నున్నారు. మే 10 నుంచి 31, 2025 వరకు జరగనున్న ఈ గ్లోబల్ ఈవెంట్ కేవలం అందాల‌ను మాత్రమే కాకుండా, తెలంగాణ సంపదను, సంస్కృతిని, చారిత్రక ఘనతను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మారబోతుంది.

120 దేశాల నుంచి రానున్న అందాల భామలు, 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కావ‌డంతో ఈ వేదిక‌పై నుంచి తెలంగాణను ప్రపంచ పర్యాటకంలో మెరిసేలా చేసే అవకాశంగా ప్రభుత్వం దృష్టిసారించింది. అందుకే మిస్ వ‌ర‌ల్డ్ 2025 పోటీల‌లో తెలంగాణ సంస్కృతిని కూడా ప‌రిచ‌యం చేయ‌నుంది స‌ర్కారు. 

2024లో తెలంగాణను సందర్శించిన అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 1,55,113గా ఉండగా, ఈ సంఖ్యను మిస్ వరల్డ్ వేదిక ద్వారా భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ప్రత్యేక పర్యటనలను ఏర్పాటు చేసింది. దీని ద్వారా తెలంగాణ అందాలను, చరిత్రను అంతర్జాతీయ మీడయా ప్రతినిధులతో ప్రపంచానికి పరిచయం చేయాలని చూస్తోంది. 

మిస్ వరల్డ్ పోటీలు-తెలంగాణ పర్యాటక వివరాలు

మే 12: చార్మినార్ నుండి లాడ్ బజార్ వరకూ వారసత్వ యాత్ర, హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని ప్రదర్శించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 

మే 13: చౌమహల్లా ప్యాలెస్ సందర్శన, నిజాం కాలపు చరిత్రను చూపించడానికి. 

మే 14: వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయం సందర్శన, అక్కడ పెరిణి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. 

మే 15: *యాదగిరిగుట్ట ఆలయం పర్యటనతో పాటు పోచంపల్లి చేనేత ప్రదర్శన కార్యక్రమం.

మే 16: హైదరాబాద్ లోని మెడికల్ టూరిజం ఆసుపత్రులు, పిల్లలమర్రి చెట్టు, ఎక్స్‌పీరియం పార్క్ సందర్శనలు ఉన్నాయి.

మే 17: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ పర్యటన ఉండనుంది.

మే 18: తెలంగాణ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన, భద్రతా ప్రమాణాల ప్రజెంటేషన్ ఉండనుంది.

మే 21: షిల్పారామం కళల కార్యశాలలు, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లో పాల్గొనడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. 

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు

మిస్ వరల్డ్ 2025 పోటీల కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మూడింటిని లక్ష్యంగా పెట్టుకుంది:

1. తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించడం
2. చేనేత, హాస్పిటాలిటీ, వారసత్వ పరిరక్షణ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచడం
3. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం

మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఈవెంట్‌ను కేవలం ఒక అందాల పోటీగా కాకుండా, సాంప్రదాయం, ఆధునికత, వైవిధ్యం కలిగిన గమ్యస్థలంగా ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.