పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియన్ డిఫెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 7వ తేదీన దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇంతకీ బుధవారం ఏం జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మే 7న పలు రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

మాక్ డ్రిల్‌లో భాగంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగిస్తారు. శత్రు దాడి జరిగితే ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో శిక్షణ ఇస్తారు. బ్లాక్అవుట్, కీలకమైన ప్లాంట్లు, సంస్థలను దాచడం, ప్రజలను ఖాళీ చేయించడం వంటివి ప్రాక్టీస్ చేస్తారు.

ఎందుకు మాక్ డ్రిల్?

1- ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టమ్ పనితీరును పరీక్షించడానికి.

2- కంట్రోల్ రూమ్, షాడో కంట్రోల్ రూమ్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి.

3- శత్రుదాడి సమయంలో ప్రజలకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వడానికి.

4- బ్లాక్అవుట్ ఏర్పాట్లను సమీక్షించడానికి.

5- కీలక ప్లాంట్లు, ప్రదేశాలను వేగంగా దాచే సామర్థ్యాన్ని పరీక్షించడానికి.

6- వార్డెన్ సర్వీసులు, ఫైర్, రెస్క్యూ, డిపో మేనేజ్‌మెంట్ వంటి సివిల్ డిఫెన్స్ సర్వీసులను అంచనా వేయడానికి.

7- దాడి సమయంలో ప్రజలను ఖాళీ చేయించే ఏర్పాట్లను సమీక్షించడానికి.

మాక్ డ్రిల్‌లో రాష్ట్రాలు ఏం చేయాలి?

1- ఎయిర్ రైడ్ సైరన్లు మోగించాలి.

2- వైమానిక దళంతో హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్ లింక్‌ను పరీక్షించాలి.

3- కంట్రోల్ రూమ్, షాడో కంట్రోల్ రూమ్‌లను యాక్టివేట్ చేయాలి.

4- ప్రజలకు, విద్యార్థులకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వాలి.

5- సివిల్ డిఫెన్స్ సర్వీసులను, ముఖ్యంగా ఆసుపత్రులు, ఫైర్, రెస్క్యూ, డిపోలను యాక్టివేట్ చేయాలి.

6- బ్లాక్అవుట్ ప్రాక్టీస్ చేయాలి.

7- కీలక ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాలను దాచాలి.

8- ప్రజలను ఖాళీ చేయించే ప్రణాళికను అప్‌డేట్ చేసి, ప్రాక్టీస్ చేయాలి.

9- బంకర్లు, ట్రెంచ్‌లను శుభ్రం చేయాలి.

పహల్గాం దాడి తర్వాత యుద్ధ భయాలు:

ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది మరణించారు. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రధాని మోదీ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి స్వేచ్ఛనిచ్చారు. మరోవైపు, భారత్ దాడి చేస్తే అణుయుద్ధం తప్పదని పాకిస్తాన్ నాయకులు బెదిరించిన విషయం తెలిసిందే.