కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గతంలో రాజకీయాల్లో భాగంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు పాకిస్థాన్ కు అస్త్రంగా మారాయి. భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు పాక్ ఆర్మీ రాహుల్ వీడియోలను వాడుకుంటోంది. ఏకంగా అంతర్జాతీయ మీడియా ముందు ప్రదర్శిస్తోంది. ఇంతకూ ఆ వీడియోల్లో ఏముందంటే...
India Pakistan War : ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోలను వాడుకుంటోంది పాక్ ఆర్మీ. పహల్గాం ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు బలమైన వాదన వినిపోస్తోంది... దీన్ని తిప్పికొట్టేందుకే రాహుల్, సత్యపాల్ గతంలో పుల్వామా దాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ పై చేసిన కామెంట్స్ ను గుర్తుచేస్తున్నారు.
పాక్ ఆర్మీ మీడియా విభాగం భారత్ కావాలనే పాకిస్ధాన్ పై దుష్ప్రచారం చేస్తోందని... పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే నరేంద్ర మోదీ సారథ్యంలోని బిజెపి ఈ తప్పుడు ప్రచారం చేస్తోందని ఐఎస్పీఆర్ (Inter-Services Public Relations) డిజి అహ్మద్ షరీఫ్ అంతర్జాతీయ మీడియా ముందు తెలిపారు. రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో అంటే 2019 లో పుల్వామాలో ఉగ్రవాదుల దాడి జరిగింది. భారత ఆర్మీ జవాన్లు వెళుతున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడిచేసి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా మోదీ సర్కార్ ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది... బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడికి దిగింది. అయితే దీన్ని ఎన్నికల్లో లబ్దికోసమే బిజెపి చేసిందని ఆనాటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, రాహుల్ గాంధీ మాట్లాడుకుంటున్న వీడియోను పాకిస్ధాన్ ప్రదర్శించింది. అంతర్జాతీయ మీడియా ముందు దీన్ని హైలైట్ చేసి పహల్గాం దాడితో తమకు ఏ సంబంధమూ లేదని నమ్మించే ప్రయత్నం చేసింది పాకిస్థాన్.
