డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా భారత దేశం డయాబెటిస్‌కు హ‌బ్‌గా మారుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కార‌ణంగా డ‌యాబెటిస్ బాధితుల సంఖ్య ఎక్కువుతోంది. ఇక డ‌యాబెటిస్ పేషెంట్స్ అన్నం తీసుకోవాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి. అయితే షుగ‌ర్ ఉన్న వారు కూడా ఎలాంటి భ‌యం లేకుండా అన్నాన్ని తినేలా ప‌రిశోధ‌కులు స్మార్ట్ రైస్ కుక్క‌ర్‌ను క‌నిపెట్టారు.  

షుగ‌ర్ వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రూ అన్నం తినాలంటే భ‌య‌ప‌డ‌తారు. అయితే డ‌యాబెటిస్ పేషెంట్స్ కూడా నిర్బ‌యంగా అన్నం తినేందుకు వీలుగా ఆచార్య ఎన్జీ రంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను త‌యారు చేశారు. ఈ కుక్క‌ర్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని ఉప‌యోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆచార్య ఎన్జీరంగ విశ్వ‌విద్యాల‌యానికి అనుబంధంగా ప‌నిచేసే కోత అనంత‌ర సాంకేతిక ప‌రిజ్ఞాన కేంద్రానికి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఈ కుక్క‌ర్‌ను క‌నిపెట్టారు. బియ్యంలో గ్లైస‌మిక్స్ ఇండెక్స్‌ను త‌గ్గించేలా స్మార్ట్ రైస్ కుక్క‌ర్‌ను రూపొందించారు. వ‌రి అన్నం తిన్నా షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉండేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రాసెసింగ్ ట్రీట్‌మెంట్ ద్వారా అన్నంలోని గ్లైస‌మిక్స్ ఇండెక్స్‌ను త‌గ్గించి నెమ్మ‌దిగా జీర్ణ‌మ‌య్యేలా చేయ‌డ‌మే ఈ స్మార్ట్ కుక్క‌ర్ ప్ర‌త్యేక‌త అని స్మార్ట్ కుక్క‌ర్ ఆవిష్క‌ర్త డి. సందీప్ రాజా తెలిపారు.

గ్లైస‌మిక్ ఇండెక్స్ త‌గ్గ‌డంతో పాటు నిదానంగా జీర్ణ‌మ‌య్యేలా ఈ అన్న మారుతుందని చెప్పుకొచ్చారు. దీంతో త్వ‌ర‌గా ఆక‌లి కాద‌ని, ఇది షుగ‌ర్ పేషెంట్స్‌తో పాటు బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతంఉద‌ని సందీప్ వివ‌రించారు. 

ఈ స్మార్ట్ కుక్క‌ర్ ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తీ ఒక్క‌రికీ క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ రైస్ కుక్క‌ర్ ప‌రిమాణం ఎక్కువ‌గా ఉంద‌ని, అయితే త్వ‌ర‌లోనే దీని సైజ్‌ను త‌గ్గించి ఇంట్లో వినియోగించుకునేలా రూపొందించాల‌ని ప‌రిశోధ‌కులు ప్లాన్ చేస్తున్నారు. 

ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉప‌యోగించి కొన్ని కంపెనీల‌తో ఒప్పందం చేసుకోవ‌డం ద్వారా ఇలాంటి స్మార్ట్ కుక్క‌ర్ల‌ను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఇక వ‌రిలో గ్లైస‌మిక్ ప‌రీక్ష‌లు ప్ర‌స్తుతం ఎక్కువ ధ‌ర‌లు ఉండ‌గా వీటిని భారీగా త‌గ్గించేందుకు ప్ర‌త్యామ్నాయంగా ఒక కిట్‌ను త‌యారు చేశారు. సాధార‌ణంగా రూ. 2.5 ల‌క్ష‌ల ఖ‌ర్చుఅవుతుండ‌గా, ఈ కొత్త ర‌కం కిట్‌తో కేవ‌లం రూ. 7500కే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ని చెబుతున్నారు.