Hyderabad: మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. వారం రోజుల్లో
ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, నిమిషాల్లో గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉండడంతో హైదరాబాదీలు పెద్ద ఎత్తున మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఛార్జీలు కూడా తక్కువలో అందుబాటులో ఉండడంతో మెట్రోకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా మెట్రో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ చార్జీలను త్వరలోనే సవరించనున్నారు. అధికారికంగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (L&TMRHL) ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మే రెండో వారం నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే టికెట్ ధరలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
ప్రస్తుతం టికెట్ ధరలు ఎంత? ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది?
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో కనిష్ఠ టికెట్ ధర రూ.10, గరిష్ఠ ధర రూ.60గా ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం, గరిష్ఠ టికెట్ ధరను రూ.75 వరకు పెంచే యోచనలో సంస్థ ఉంది. దీనివల్ల వార్షికంగా అదనంగా రూ.150 కోట్లు ఆదాయం వచ్చేలా అంచనా వేస్తున్నారు. అలాగే కనీస మొత్తాన్ని కూడా రూ. 15కి పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
మెట్రో సంస్థ ప్రకారం.. సంస్థకు ఏటా రూ.1500 కోట్లకు పైగా ఆదాయం ఉండగా ఖర్చు రూ. 2000 కోట్లు దాటుతోంది. ప్రధాన ఖర్చుల్లో మెట్రో రైళ్ల నిర్వహణ, సిబ్బంది వేతనాలు, బ్యాంకు రుణాలపై వడ్డీలు మొదలైనవి ఉన్నాయి. కరోనా ముందు రోజుకు సంస్థకు సగటున రూ.80 లక్షల ఆదాయం వస్తుండేది. కానీ 2020 నుంచి 2022 వరకూ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, మాల్స్, ప్రకటనల ద్వారా ఆశించిన ఆదాయం రాకపోవడంతో కంపెనీ ఆదాయంలో తీవ్ర తగ్గుదల నమోదైంది.
అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నాలు
2022 సెప్టెంబరులో, టికెట్ ధరలు పెంపు అవసరం ఉన్నందున, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తితో Fare Fixation Committee (FFC)ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నగరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి, తదనంతరం కేంద్రానికి నివేదిక సమర్పించింది. కానీ 2023లో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభం కావడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా నిలిచిపోయింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా, మెట్రోపై ప్రయాణ భారాన్ని అధికంగా ప్రభావితం చేస్తోందని ఎల్ అండ్ టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా టికెట్ ధరల పెంపు తర్జన భర్జనల్లో ఉంది.
రవాణా ఆధారిత అభివృద్ధి (TOD) కింద రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు 267 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఇప్పటి వరకు కొన్ని గిట్టుబాటు ప్రాంతాల్లోనే కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించగా, మిగతా భాగం ఇంకా ఖాళీగానే ఉంది. దీని వలన భూముల ద్వారా ఆశించిన ఆదాయం కూడా పూర్తిగా రాలేదని కంపెనీ భావిస్తోంది.